తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారు. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసే ప్రకటన ఏంటా అని అందరూ ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2022-2023 రెండోరోజు సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించే అవకాశం వున్నట్లు సమాచారం.
వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అయితే గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి
ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. మొత్తం 91,142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయిస్ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.
నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్.