Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగ్యనగరిలో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గందరగోళం

భాగ్యనగరిలో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గందరగోళం
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:35 IST)
హైదరాబాద్ నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గందరగోళం నెలకొంది. భాగ్యనగరిలోని ట్యాంక్‌ బండ్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. 
 
కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్‌బండ్‌లోనే గణేష్‌ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది.
 
ఈ పరిస్థితుల్లో గణేష్‌ నిమజ్జనంపై సోమవారం సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. 
 
కాగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది. 
 
హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ ఆదేశిస్తాడు... జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడు...