వైసీపీలో సంచలన పరిణామం నమోదైంది. వైసీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఓ సామాన్య కార్యకర్తను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జగన్ గొప్పదనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నానని తెలిపారు.
ఏపీలో ప్రజలు వైసీపీని బలంగా నమ్మారని, అందుకే అత్యధిక స్థానాల్లో విజయాలు కట్టబెట్టారని, కానీ తెలంగాణలో వైసీపీ పోరాటాలు చేయలేదన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైసీపీ ముందుకెళ్లేలా లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ఓ జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఆ పార్టీ తరఫున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే తాను స్వాగతిస్తానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. షర్మిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.