రాష్ట్ర విభజనకు ముందు వరకూ రాజకీయాలను శాసించిన రెడ్డి సామాజికవర్గానికి.. వైఎస్ షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్లుంది. ప్రస్తుతం షర్మిలను కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న వారిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే,ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుండం ప్రస్తావనార్హం.
ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజికవర్గ నేతలు షర్మిల నివాసం వద్ద కనిపిస్తున్నారు. వీరితోపాటు, కాంగ్రెస్‌లో వైఎస్ విధేయులుగా ఎక్కువ కాలం చెలామణి అయి, తర్వాత కనుమరుగయిన రెడ్డి వర్గ నేతలు కూడా షర్మిల స్థాపించనున్న పార్టీ వైపు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ తరహా నేతలే ప్రస్తుతం లోటస్‌పాండ్ వద్ద దర్శనమిస్తున్నారు.
ప్రధానంగా.. రెడ్డి సంఘాలు కూడా షర్మిల, భర్త బ్రదర్ అనిల్‌తో భేటీ అవుతుండటం బట్టి.. తెలంగాణలో మళ్లీ రెడ్డి రాజ్యం తీసుకురావాలన్న కాంక్ష ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది.
షర్మిలను కలుస్తున్న వారిలో 30 ఏళ్ల రెడ్డి సామాజికవర్గ యువకులే ఎక్కువమంది ఉండటం పరిశీలిస్తే, షర్మిల ద్వారా తెలంగాణ రాజకీయాలలో మళ్లీ రెడ్డికార్పెట్వేయవచ్చన్న ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. వీరితోపాటు, హైదరాబాద్‌లో ఉన్న ఒకప్పటి వైఎస్ విధేయులు, జగన్ అభిమానులు కూడా లోటస్‌పాండ్‌కు క్యూ కడుతున్నారు.
వైఎస్ కూతురిగా షర్మిలను సమర్ధవంతమైన నాయకురాలిగా తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. ఆమె ఇక్కడ పార్టీ పెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. షర్మిల తెలంగాణలో వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆమె పార్టీ పెడితే వైఎస్ అభిమానులే కాదు, జగన్ అభిమానులు కూడా షర్మిలకు పట్టం కడతారు.
టీఆర్‌ఎస్, బీజేపీ గత్యతరం లేక రెడ్లను తమ అవసరాలకు వాడుకుంటున్నాయి. అయితే షర్మిల ఒక్క రెడ్లకే కాదు. అన్ని కులాలకు న్యాయం చేసే నేత. ఆమె రాకతో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులొస్తాయి అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడయన, నగర కాంగ్రెస్ సీనియర్ నేత చేపూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలో రెడ్డి యువతరం కూడా షర్మిలపై ఎక్కువ అంచనాలతో ఉన్నట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ రెడ్లను కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండటం కోసమే వాడుకుంటోంది తప్ప, తమపై ప్రేమతో కాదని రెడ్డి సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు.
టీఆర్‌స్ పార్టీ రెడ్లను బానిసల్లా చూస్తోంది. రెడ్ల బలం చూసి భయంతోనే టీఆర్‌ఎస్ రెడ్లకు పదవులిస్తోంది. అవి కూడా ప్రాధాన్యం లేనివే. వారంతా కింద నుంచి ఏ 20లోనో కనిపిస్తారు. పేరుకు రెడ్లకు పదవులున్నా పెత్తనమంతా కేసీఆర్‌దే. ఎవరికీ నిర్ణయాధికారం లేదు. నిజం చెప్పాలంటే తెలంగాణ రెడ్లు రాజకీయంగా అనాధల్లా ఉన్నారు.
ఒకప్పుడు అధికార స్థానంలో ఉండి అన్ని వర్గాలకు సేవలందించిన రెడ్లు, ఇప్పుడు అక్కడక్కడ తలదాచుకోవలసి రావడం దురదృష్టం. షర్మిల రాకతో తెలంగాణ రెడ్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న మాట నిజం. ముఖ్యంగా రెడ్డి యూత్ కొత్త ఆశతో ఉన్నారు.
మొత్తం 40 నియోజకవర్గాల్లో రెడ్ల ప్రభావం ఉంది. వీరంతా షర్మిల పార్టీ వైపు కచ్చితంగా నడుస్తారు. కరీంనగర్ నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తోంది అని రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.