Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకరి అనారోగ్యం.. ఏడుగురి పాలిట 'శాపం' - 7 మందిని మింగేసిన ఎస్ మలుపు

Advertiesment
ఒకరి అనారోగ్యం.. ఏడుగురి పాలిట 'శాపం' - 7 మందిని మింగేసిన ఎస్ మలుపు
, గురువారం, 3 డిశెంబరు 2020 (08:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం 9 మంది ఉండగా, అందులో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో 11 యేళ్ళ బాలుడు ఉన్నాడు. ప్రమాద స్థలంలో ఈ బాలుడు చేసిన ఆర్తనాదాలు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించాయి. తల్లి మృతదేహం వద్ద కూర్చుని.. గుండెల్లోంచి ఏడుపు తన్నుకొస్తుండగా.. ‘అమ్మా.. లేమ్మా.. ఇంటికి పోదాం’ అని పిలిచాడు. ఎప్పుడూ పిలవగానే బదులిచ్చే అమ్మ పలకకపోవడంతో హృదయవిదారకంగా రోదించాడు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ కాలాపత్తర్‌లోని మక్కా కాలనీకి చెందిన నాజియా బేగం (40) కొంతకాలంగా కీళ్ళనొప్పులు, పక్షవాతంతో బాధపడుతూ వచ్చారు. స్థానికంగా వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గకపోవడంతో కర్ణాటకలోని గురుమిట్‌ కల్‌లో ఆయుర్వేద మందు దొరుకుతుందని తెలిసినవారు చెప్పడంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో ఆమె భర్త ఎండీ ఆసిఫ్‌ ఖాన్‌ (45), కూతురు మెహక్‌ సానియా(18), ఆసిఫ్ ఖాన్‌ చెల్లెలు నజియా భాను (30), హర్షియా బేగం(28), నజియా భాను కూతురు ఆయేషా (4), ఆసిఫ్ ఖాన్‌ బావ ఎండీ ఖాలేద్‌(43), అసిఫ్ ఖాన్ చిన్న తమ్ముడు అన్వర్‌ ఖాన్‌, నషిర్‌ బేగ్‌(11), తయ్యబ్‌, అయాన్‌.. అంతా కలిసి ఏపీ 09 ఏ జెడ్‌ 3896 ఇన్నోవా వాహనంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గురుమిట్‌ కల్‌ బయలుదేరారు. 
 
బుధవాలం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సరిగ్గా చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేట్‌ వద్దకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా.. చేవెళ్ల నుంచి మొయినాబాద్‌ వెళ్తున్న బోరువెల్‌ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న 11 మందిలో ఆరుగురు.. నాజియా బేగం, ఆసిఫ్‌ ఖాన్‌, మెహక్‌ సానియా, నజియా భాను, అర్షియా బేగం, ఆయేషా అక్కడిక్కడే మృతిచెందారు. 
 
ఎండీ ఖాలేద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాళ్లు విరిగి, తీవ్రగాయాలపాలైన తయ్యబ్‌, అయాన్‌లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తయ్యబ్‌ ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇక.. ఇన్నోవాలోని చివరి వరుస సీట్లలో కూర్చున్న నషీర్‌ బేగ్‌ (11), అన్వర్‌ఖాన్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 
 
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తుండడాన్ని చూసి.. తన కుటుంబసభ్యులంతా రక్తపుమడుగులో విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి.. చిన్నారి నషీర్‌ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఏం జరిగిందో తెలియక కొంతసేపు షాక్‌లో ఉండిపోయాడు.
 
చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల వద్దకు వెళ్లి తల్లి మృతదేహం వద్ద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. రోడ్డుపక్కన టైరుపై భయంగా కూర్చుని బిత్తరచూపులు చూస్తున్న నషీర్‌బేగ్‌ను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఇన్నోవా డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. చేవెళ్ళ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో 24 గంటల్లో 2700 కరోనా మృతులు