Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కొత్తగా 7 వైద్య కాలేజీలు: మంత్రివర్గం నిర్ణయం

తెలంగాణాలో కొత్తగా 7 వైద్య కాలేజీలు: మంత్రివర్గం నిర్ణయం
, సోమవారం, 31 మే 2021 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
ఈ కాలేజీలను మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్నాయి. మెడిక‌ల్ కాలేజీల‌ ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. 
 
గతంలోనే సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌, జగిత్యాల జిల్లాలకు మెడిక‌ల్ కాలేజీలు కేటాయిస్తామని ప్రకటించగా ఎట్ట‌కేల‌కు వాటిని ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. 
 
మరోవైపు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
 
లాక్డౌన్ పొడిగింపు నేపధ్యంలో.. కొవిడ్, సడలింపు నిబంధనలను అనుసరించి., ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.
 
కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్ ,నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీ తోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
 
ఇప్పుడు అమలు చేస్తున్న బిసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం తెలిపింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పి వి నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్) గా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయించింది.
 
రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని , ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త!