Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్‌వా?: రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్‌వా?: రేవంత్‌రెడ్డి
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (16:25 IST)
''కేసీఆర్‌.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్‌వా? చింతమడకు ఎంపీటీసీవా? ఆ రెండు గ్రామాల ప్రజల కోసమే పనిచేస్తావా? మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి?'' అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న ఎర్రవల్లి గ్రామస్థులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని, ఆయన సొంతూరు చింతమడకలో కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. వీటికి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 
 
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తో కలిసి ఆదివారమిక్కడ రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం నుంచి రోజూ ఒక నియోజకర్గంలో 'పట్నం గోస' కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. 
 
20 జిల్లాల్లో ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా ఇవ్వలేదన్నారు. ప్రగతి భవన్‌ను ఏడాదిలోపే నిర్మించుకున్న కేసీఆర్‌ ఐదేళ్లు కావస్తున్నా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో 128 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్లను పేదలకు కేటాయించేలా ఒత్తిడి తెస్తామన్నారు. 'పట్నం గోస' కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను గవర్నర్‌, సీఎం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెస్తామని రేవంత్‌ చెప్పారు. అయినా సమస్య పరిష్కారం కాకుంటే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తర్వాత భారీ ఉద్యమం చేపడతామన్నారు. 
 
కిషన్‌రెడ్డి ఎందుకు సమీక్షించరు?
ప్రధానమంత్రి ఆవా్‌సయోజన పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్‌ సర్కారు దుర్వినియోగం చేస్తోందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తన నియోజకవర్గం పరిధిలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పీఎంఏవై నిధుల విషయంలో సమీక్ష ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు.
 
''తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైల్వే అంటే ఏంటో తెలియదు. చాలా ప్రాంతాల్లో రైలు సౌకర్యం ఉండేది కాదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైల్వే లైన్లు వేశారు'' అన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై జాలి పడుతున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. కిషన్‌రెడ్డి, మోదీ పుట్టకముందే తెలంగాణలో రైల్లే లైన్లు ఉన్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగ మహిళల కోసం ఉచిత శిక్షణ-ప్రొఫెసర్ కెన్నెడీ