తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు వీలుగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నేతన్నకు చేయూత పథకం నమోదు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీన్ని అమలు చేయాలని అధికారులకు సూచించింది.
తమ ఆదాయంలో 50 శాతం నేత పని ద్వారా పొందే 18 ఏళ్లు దాటిన వారు అర్హులని పేర్కొంది. రూ.368 కోట్లతో పునఃప్రారంభించిన ఈ పథకంపై గురువారం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీనిని అమలు చేయాలని సూచించింది.
రాష్ట్రంలో చేనేత సంఘాల్లో, సహకారేతర రంగంలోని జియో ట్యాగింగ్ మగ్గాలపై పనిచేసే నేత కార్మికులు, వృత్తికి అనుబంధంగా డైయింగ్, టైయింగ్ డిజైన్, వైండింగ్, వార్పింగ్, సైజింగ్ పనులు చేసే వారికి దీనిని అమలు చేయనున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఈ కింది వివరాలను సమర్పించాల్సివుంటుంది. చేనేత కార్మికుని పూర్తి పేరు, వివరాలు, చిరునామా, జియోట్యాగింగ్, ఆధార్, బ్యాంకు వివరాలు, మొబైల్ నంబర్, వృత్తిలో ఎన్నేళ్లుగా ఉన్నారు.. క్రితం సారి పథకంలో ఉన్నారా.. నెలవారి వేతనాలతో పాటు వాటి స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.