Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాచుకున్న సొమ్ము ఎలుకల పాలు... ఎక్కడ?

దాచుకున్న సొమ్ము ఎలుకల పాలు... ఎక్కడ?
, ఆదివారం, 18 జులై 2021 (16:46 IST)
ప్రజల సొమ్ము నేల పాలు అన్నది సామెత. కానీ ఇక్కడ దాచుకున్న సొమ్ము ఎలుకలపాలైంది. కడుపులో కణతికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు దాచిపెట్టుకున్న రూ.2 లక్షల నోట్లను ఎలుకలు కొట్టేసి పనికిరాకుండా చేశాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. 
 
ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా నివసిస్తున్న భూక్య రెడ్యా కడుపులో కణతితో బాధపడుతున్నాడు. 
 
దానిని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే రెడ్యా.. ఓవైపు బాధను భరిస్తూనే కూరగాయలు అమ్ముతూ డబ్బులు కూడబెడుతూ వస్తున్నాడు.
 
దీనికితోడు కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొచ్చి మొత్తం రూ.2 లక్షలను బీరువాలో భద్రపరిచాడు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన రెడ్యా బీరువాలోని డబ్బులను చూసి హతాశుడయ్యాడు. ఎలుకలు వాటిని ముక్కలుముక్కలుగా కొట్టేయడంతో లబోదిబోమన్నాడు. 
 
ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు పనికిరాకుండా పోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆ డబ్బును తీసుకుని గత నాలుగు రోజులుగా మహబూబాబాద్‌లోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ నోటు ముక్కలను తీసుకోలేమని, రిజర్వు బ్యాంకు అధికారులను సంప్రదించే మార్గం చూపిస్తారంటూ స్థానిక బ్యాంకు అధికారులు సలహా ఇచ్చారు. అక్కడ కూడా పని జరుగుతుందని చెప్పలేమని అనుమానం వ్యక్తం చేయడంతో బాధితుడు భూక్య కన్నీటి పర్యంతమయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19న ఛలో తాడేపల్లి - రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు