భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త... ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత కరోనా వైరస్ సోకి చనిపోయందని బంధువులందర్నీ నమ్మించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో భర్త అడ్డంగా దొరికిపోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయ్, కవిత అనే దంపతులు గత కొంతకాలం నుంచి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. విజయ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ కాగా, కవిత ఇంట్లోనే ఉంటుంది.
అయితే కవిత వేరే వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను చంపేయాలని విజయం నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళికతో కవితను విజయ్ హత్య చేశాడు. ఆ తర్వాత కరోనాతో చనిపోయిందని ప్రచారం చేశాడు.
కవిత హత్య కేసులో భర్త విజయ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. భార్య కవిత వేరే వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో పక్కా ప్రణాళికతో కవితను విజయ్ హత్య చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆమె కొవిడ్‌తో చనిపోయినట్లు చిత్రీకరించాడు. విజయ్ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారు. కేసును ఛేదించేందుకు కవిత మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించగా, ఆమెకు కరోనా సోకలేదని వైద్యులు తేల్చారు.
మృతురాలి కరోనా టెస్టు రిపోర్టును పరిశీలించగా నెగిటివ్ ఉంది. మొత్తానికి విజయ్ ఆమెను హత్య చేసినట్లు తేలింది. నిందితుడు ఆటో డ్రైవర్ అయినందున భార్య మృతదేహాన్ని తన వాహనంలోనే నేరుగా పిల్లిగుంట్లకు తీసుకెళ్లి పాతిపెట్టినట్లు సీపీ స్పష్టం చేశారు.