Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ దిగ్బంధం, కోదండరాం అరెస్ట్‌, తిరుమలలో హాయిగా కేసీఆర్

తెలంగాణ పోలీసులు అన్నంత పనీ చేశారు. హైదరాబాద్‌లో అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని కోదండరామ్ నాయకత్వంలోని టీజేఏసీ ప్రకటించడంతో. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు.

హైదరాబాద్ దిగ్బంధం, కోదండరాం అరెస్ట్‌, తిరుమలలో హాయిగా కేసీఆర్
హైదరాబాద్ , బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (05:43 IST)
తెలంగాణ పోలీసులు అన్నంత పనీ చేశారు. హైదరాబాద్‌లో అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని కోదండరామ్ నాయకత్వంలోని టీజేఏసీ ప్రకటించడంతో. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్‌ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 330 గంటల ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆయనతోపాటు మరో 50 జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
అయితే కోదండరాంను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రొఫెసర్‌ ఆచూకీపై వెంటనే ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కీలక నాయకుల అరెస్టుల సమాచారంతో రాజధాని సహా రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్‌ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇదివరకే ప్రకటించింది.
 
నిరుద్యోగ ర్యాలీకి ర్యాలీకి అనుమతిలేదని, ఎవరైనాసరే నిషేధాజ్ఞలు మీరితే అరెస్టులు తప్పవని ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీంద్ర అన్నారు. ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేశారు. 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించారు. 
 
ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరించారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్‌ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
 
జేఏసీ పిలుపు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్‌ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తయిన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వారు గుంపులుగా జన సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక మూడు కమిషనరేట్లలో పోలీసు సిబ్బందికి ‘స్టాండ్‌ టు’ప్రకటించి అందరూ కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇక్కడ హైదరాబాద్‌లో నిరుద్యోగుల జీవన్మరణ సమస్యలపై సభ పెట్టుకోవడానికి కూడా అనుమతివ్వకుండా ఫ్రెండ్లీ పోలీసులు కోదండరామ తో సహా టీజేఏసీ నాయకులను, విద్యార్థులను ముందస్తు అరెస్టు చేస్తుండగా, అక్కడ తిరుపతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా బసచేసి తిరుమల శ్రీనివాసునికి తెలంగామ మొక్కు చెల్లంచుకుంటుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృత్యుంజయురాలా... సర్పంజయురాలా? 34 సార్లు కాటేసినా బతకడమా?