భర్త శవాన్ని తీసుకుని ఒక్కదాన్నే ఇండియా వస్తే కూడా కనికరం లేదా.. ప్రాణాపాయంలో స్వాతి రెడ్డి
అమెరికాలో పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి భార్య స్వాతి.. అత్తింటి వారు తనపై చేస్తున్న ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెంది నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది.
అమెరికాలో పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి భార్య స్వాతి.. అత్తింటి వారు తనపై చేస్తున్న ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెంది నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రమైన మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్న భర్త శవాన్ని తీసుకుని ఒంటరిగా ఇంటికి వస్తే గత రెండు రోజులుగా ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకోలేక హార్పిక్ రసాయనాన్ని తాగి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. భర్తశవాన్ని కడసారి చూసుకోవడానికి కూడా అనుమతించని మధుకర్ రెడ్డి బంధువులు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమెను పట్టుకుని ఘోరంగా కొట్టారు. అక్కడినుంచి ఆమెను తరిమేశారు.
పెళ్లయినప్పటినుంచి గత ఆరేళ్లుగా తమ మధ్య దాంపత్యం జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను, చాలాకాలంగా డిప్రెషన్‌లో ఉన్న భర్తను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలను, చివరకు భర్త ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆమె ఒక మీడీయా చానల్‌కు జరిగింది చెబితే అనరాని మాటలతో దూషించి ఫోన్ కాల్స్‌తో బెదిరించడమే కాకుండా తన శీలంమీదే అపవాదు వేయడానికి మెట్టింటివారు పూనుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చావుబతుకులు మధ్య కొట్టుకులాడుతోంది స్వాతి.
అమెరికాలో భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కాబట్టి భర్త వంటపనిలో సాయం చేస్తే దానికి కూడా తనమీదే తప్పుడు ప్రచారమే చేశారని, ‘ఒరేయ్ మగాడివయ్యుండి ఆ పనులేంట్రా’ అని మధును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఆయన చనిపోయాక ఇక ఇప్పుడైతే అడ్డు అదుపూ లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు స్వాతి.
"వాళ్లు వేసే ఆరోపణలన్నీ తప్పని నేను ప్రూవ్ చేస్తున్నాను. నిజమని ఒక్క రుజువు చూపించమనండి నా భర్త దహన సంస్కారాలకు వెళితే వాళ్ల బంధువు రవీందర్‌రెడ్డితో జుట్టు పట్టుకొని లాగి, కొట్టించారు నన్ను. ఒక స్త్రీననే విచక్షణ కూడా లేకుండా అలా చేయి చేసుకుంటారా నా భర్తను చివరి చూపు చూసుకునే హక్కు నాకు లేదా? ఇంటికొచ్చేసరికి నిర్జీవంగా పడి ఉన్న భర్తను చూసి ఎలా తట్టుకొని, ఒక్కదాన్ని ఆ శవాన్ని తీసుకొని ఇండియాకు వచ్చాను. ఎంత కుంగిపోయి ఉంటాను కనీసం ఆ కనికరం కూడా చూపరా? నా చేయి చేసుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. స్త్రీ మీద చేయి చేసుకున్న వ్యక్తికి అలా బెయిల్ ఎలా ఇస్తారు? ఇదేనా ఇక్కడ ఆడవాళ్లకు జరిగే న్యాయం? నాకు న్యాయం కావాలి" అని ప్రశ్నించిన స్వాతి ఆ తర్వాత కొద్ది గంటలకే తన శీలంపై ఆరోపణలు చేస్తూ దాడి చేయడంతో తట్టుకోలేకఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు.
భర్తను విదేశంలో కోల్పోయిన ఒక యువతి తనకు, తన పసిపాపకు ఇక రక్షణ ఎవరు? అని విచారిస్తుంటే ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించేలా ఆమెను బెదిరించిందెవరు, దూషించిందెవరు, చివరకు శీలంపై ఆరోపించిందెవరు.. దాడి చేసిన వ్యక్తికి సత్వర బెయిల్ ఇచ్చి మరీ సాగనంపిందెవరు?
ఇది తెలంగాణ అమ్మాయికి సంబంధించిన విషయం కాదు. స్త్రీల రక్షణకు సంబంధించి డజన్ల కొద్దీ చట్టాలు చేసినా ఈ దేశంలో ఏ ప్రాంతంలోనూ ఇంకా మహిళకు నిజమైన రక్షణను ఏ చట్టమూ ఇవ్వలేకపోతోందన్నదే నిజం. ఇదేనా ఇక్కడ ఆడవాళ్లకు జరిగే న్యాయం? అంటూ స్వాతి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి ముందు వేసిన ప్రశ్నకు మన వ్యవస్థ నిజంగా సమాధానం ఇవ్వగలదా?