తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిన బాధితురాలి కేసు ఇపుడు మరో మలుపు తిరిగింది. దీనికి కారణం స్వయంగా ఆ బాధితురాలే. తాజాగా పోలీస్ స్టేషనుకు వెల్లిన ఆమె.. తనను బలాత్కారించింది 139 మంది కేవలం 36 మందేనని లిఖితపూర్వకంగా మరో ఫిర్యాదు ఇచ్చింది. పైగా, తొలుత ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పలువురి అమాయకుల పేర్లను తొలగించాలని పోలీసులను ప్రాధేయపడింది. అంతేకాకుండా, తనను ఈ స్థితికి తీసుకొచ్చిన డాలర్ బాయ్‌కు డ్రగ్ మాఫియా వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. తనకు కూడా డ్రగ్స్ రుచి చూపించి, పలుమార్లు ఆత్యాచారం చేశాడని పేర్కొంది.
ఆమె తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో సోమాజిగూడలోని ఓ కార్యాలయంలో ఉద్యోగ రీత్యా పరిచయమైన డాలర్ భాయ్ తనతో చనువుగా ఉండేందుకు యత్నించేవాడని, తనకు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి మూడు రోజుల పాటు ఆఫీసు గదిలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడని స్పష్టంచేశారు.
'శారీరకంగా, మానసికంగా హింసించి, పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకుని తాళి కట్టాడు. అతడి ప్రవర్తన కారణంగా కుంగిపోయాను. ఆత్మహత్యకు కూడా యత్నించాను. దేశ విదేశాల్లోని డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలున్నాయని చెప్పేవాడు. తనను డాలర్ బాయ్‌గా పిలవమంటూ.. పెద్ద డాన్ అవ్వాలని కలలు కనేవాడు. తన మాట వినకపోతే మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు' అని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది.
ఇదిలావుండగా, ఈ కేసులో బాధితురాలి నంచి సీసీఎస్ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. తనపై 139 మంది లైంగిక దాడి చేయలేదని కేవలం 36 మంది మాత్రమే చేశారనీ, మరో 50 మంది మానసికంగా వేధించారంటూ చెప్పుకొచ్చింది. కాగా, ఈ కేసును సున్నితంగా పరిశీలిస్తున్న సీసీఎస్ పోలీసులు, బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని, కోర్టుకు అందజేస్తామన్నారు.