తెలంగాణ రాష్ట్రానికి వాయుగుండం ముప్పుతప్పింది. ఈ కారణంగా వర్షాల తీవ్రత కూడా తగ్గింది. అయితే, ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒడిశా తీర ప్రాంతంలో భువనేశ్వర్‌కు ఉత్తర ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం బలహీనపడి అల్పపీడనంగా మారి ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
మరోవైపు, రుతుపవనాల ద్రోణి నలియా, అహ్మదాబాద్, ఇండోర్, రాయగఢ్ మీదుగా కోస్తా ఒడిశా వద్ద ఉన్న వాయుగుండం వరకు వ్యాపించి ఉన్నదని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంగా మరఠ్వాడా, విదర్భం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణాపై నామమాత్రంగానే ప్రభావం ఉందని ఐఎండీ వెల్లడించింది.