తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఈ క్రమంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నెల 20న విధించిన నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ పొడిగింపుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది.
మరోవైపు, తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు.
ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవకాశం ఉంది. టీకా, కొవిడ్ పరీక్షలు వేర్వేరు కేంద్రాల్లో ఉండాలన్న వాదన కూడా ఉందన్నారు. దీనిపై ఆలోచిస్తామన్నారు. వ్యాక్సిన్ల కోసం పకడ్బందీగా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.