తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇపుడు మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు భారత రైల్వే శాఖ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రైలును హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు నడపాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
వాస్తవానికి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి తొలి వందే భారత్ రైలును ప్రారంభించారు. తాజాగా సికింద్రాబాద్- - తిరుపతి ప్రాంతాలను కలుపుతూ రెండో వందే భారత్ రైలును అందుబాటులోకి తెచ్చారు. ఇపుడు హైదరాబాద్ - బెంగుళూరుల మధ్య ఈ వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వందే భారత్ రైలును నడిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే హైదరాబాద్ నుంచి మూడు వందే భారత్ రైళ్లు సేవలు అందించనున్నాయి.
కాగా, ప్రస్తుతం హైదరాబాద్ - బెంగుళూరు ప్రాంతాల మధ్య దూరం 570 కిలోమీటర్లు. ఈ దూరాన్ని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11 గంటల సమయంలో పూర్తి చేస్తున్నాయి. అదే వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే ఏడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ రైలును హైదరాబాద్ కాచిగూడ నుంచి నడుపనున్నట్టు గత జనవరిలోనే వార్తలు వచ్చాయి. అలాగే, సికింద్రాబాద్ నుంచి పూణెకు కూడా మరో వందే భారత్ రైలు నడపాలన్న ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్టు సమాచారం.