Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి.. లేదంటే సీన్ మారుతుంది: తలసాని

తెలంగాణకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి.. లేదంటే సీన్ మారుతుంది: తలసాని
, బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (17:11 IST)
తెలంగాణ ఏర్పాటు సమయంలో జరిగిన పరిణామాలను తప్పుబడుతూ.. కాంగ్రెస్ పార్టీ వల్లే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణను విభజించిన తీరును ప్రధాని మోదీ మరోసారి తప్పుబట్టారు.

అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఏపీ నుంచి పెద్దగా స్పందన రాకపోయినా.. తెలంగాణలో మాత్రం ఆయన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టంలేదనే విషయం మరోసారి తేలిపోయిందని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన తెలంగాణపై అందుకే వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.
 
తాజాగా టీఆర్ఎస్ మంత్రి తలసాని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. దేశంలో తెలంగాణ ఉందో, లేదో అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంట్లో ప్రధాని మోడీ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 
 
బడ్జెట్ మీద ప్రసంగించాల్సిన ప్రధాని, ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల దుర్మార్గంగా  వ్యవహరిస్తుందన్నారు.  రాజ్యాంగం ప్రకారం విభజన జరిగినప్పుడు విభజన హామీలను ఏమి చేశారని ప్రశ్నించారు.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ గెలుస్తాడనే భయంతో ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగం నడుస్తుందన్న తలసాని.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన నడవదన్నారు. 
 
రాజ్యాంగం గురించి నోటికి వచ్చినట్టు వాగుతున్నారని.. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ మరోసారి భగ్గు మంటదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని అమ్మాలని చూస్తున్నారన్న ఆయన..  రైతన్న ఉద్యమంలో రైతుల పైకి కారెక్కించి తొక్కించి చంపిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీదన్నారు.  
 
కరోనా విషయంలో ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసిన మోదీ.. కనీసం పేదవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ట్రైన్ ఉచితంగా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబంపై ఏకవచనంతో విమర్శిస్తే ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తామన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు మూడు డ్రెస్సులు మారుస్తూ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తాడన్నా తలసాని..  ప్రధాని మోడీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌పై పోరు.. భారత మార్కెట్లోకి తొలి నాసల్ స్ప్రే