వరంగల్‌లోని కాకతీయ వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని ధరవాత్ ప్రీతి ఆదివారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. అలాగే, మృతురాలి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్, అతని అనుచరులు చేసిన ర్యాంగింగ్‌ను భరించలేక ఈ నెల 22వ తేదీన ప్రీతి విషపు ఇంజెక్షన్‌ను ఆపరేషన్ థియేటర్‌లో వేసుకున్నారు. దీంతో అక్కడే అపస్మారకస్థితిలో పడిపోయాడు. ఆమెకు తొలుత ఎంజీఎంలో చికిత్స అందించారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆరోగ్యం ఆదివారానికి మరింతగా క్షీణించింది. గుండెతో పాటు కిడ్నీ, కాలేయం పనితీరులో మందగించింది. పైగా, ఆదివారం ఉదయం నుంచి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఈ క్రమంలో ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటల సమయంలో చనిపోయినట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
ఈ మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం ప్రకటించారు. ఇందులో ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తరపున రూ.20 లక్షలు ఉన్నాయి. అలాగే, ఆమె కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, వైద్య కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్.ఓ.డిలపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మరోవైపు, ప్రీతి మృతి తర్వాత అర్థరాత్రి వరకు హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించకుండా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు అంగీకరించడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో వారు తమ స్వస్థలమైన జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.
అంతకుముందు ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి హరీష్ రావు ప్రీతి ఆరోగ్యంపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.