తెలంగాణలో అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో ఒక్కసారిగా 24 మంది సర్పంచులు రాజీనామాలు చేశారు. కొమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తమ నిరసనను తెలియజేశారు.
కొమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన 24 గ్రామాల సర్పంచులు తమ పదవులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలు ఆమోదించేలా చూడాలని జడ్పీ చైర్‌పర్సన్‌కు ఆ సర్పంచులు వినతి పత్రం ఇచ్చారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం మెడ మీద కత్తిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వాళ్లు చెప్పారు. పైన ప్రభుత్వం చెబుతున్న దానికి గ్రామాల్లో జరుగుతున్న దానికి పొంతన లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోడు భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామాల్లో తిరగలేక పోతున్నామని రాజీనామా చేసిన 24 మంది సర్పంచులు తెలిపారు.