దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్‌ను అమలు చేస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. అదేసమయంలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఈ లాక్డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెల్సిందే.