తెలంగాణా రాష్ట్రంగా అవతరించిన తరువాత ప్రధాన పార్టీల్లో చీలికలు రావడం.. చాలామంది నేతలు టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఇదంతా తెలిసిందే. ముఖ్యంగా పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారి సంఖ్యే ఎక్కువ.
అలాగే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా తెలంగాణా రాష్ట్రసమితిలో చేరారు. వారికి పదవులు కూడా లభించాయి. ప్రస్తుతం మంత్రులుగాను, కీలక పదవుల్లోను కొనసాగుతున్నారు. అయితే ఎపిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో అడ్రస్ లేకుండా పోతోందన్నది విశ్లేషకుల భావన.
అందుకే తెలంగాణాలో ఉన్న టి.టిడిపి నేతలందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారట. టిటిడిపి అధ్యక్షుడుగా ఉన్న రమణే టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకున్నారట. టిఆర్ఎస్ పైన కనీసం విమర్సలు కూడా చేయడం లేదు తెలుగుదేశంపార్టీ నాయకులు.
టిఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోంది బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. టిడిపిలో ఉన్న నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. దీంతో చేసేది లేక టిటిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని తెలంగాణా రాష్ట్రసమతి జెండా పట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట ఎల్.రమణ.
అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు మాత్రం పార్టీని వీడొద్దని రమణను బుజ్జగిస్తున్నారట. కానీ ఇన్నిరోజుల పాటు పార్టీని నమ్ముకుని ఉన్నా కనీసం విమర్సలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండడం..నమ్మకంగా ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా టిఆర్ ఎస్ లోకి వెళ్ళిపోతుండడం రమణకు ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే తాను కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారట.