Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... నేతలు ఓ హెచ్చరిక : మంత్రి కేటీఆర్

దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... నేతలు ఓ హెచ్చరిక : మంత్రి కేటీఆర్
, మంగళవారం, 10 నవంబరు 2020 (16:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఓడిపోయారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1472 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తుది రౌండ్ ఓట్ల లెక్కింపు వరకు సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒక రౌండ్‌లో బీజేపీ, మరో రౌండ్‌లో తెరాస ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ, చివరకు విజయం బీజేపీని వరించింది. 
 
ఈ ఫలితం తర్వాత తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. గత ఆరున్నరేళ్లుగా ప్రతి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయాలు సాధిస్తూనే వచ్చిందని గుర్తుచేశారు. విజయాలతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం తెరాసకు అలవాటు లేదన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని చెప్పారు. 
 
ఈ ఉప ఎన్నికల్లో 61320 మంది దుబ్బాక ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అదేసమయంలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే దానిపై అందరం కలిసి సమీక్షించుకుంటామన్నారు. తమ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతూ, దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
 
అదేసమయంలో దుబ్బాక ఉపఎన్నికలో తాము ఆశించిన ఫలితం రాలేదని, ఇది పార్టీ నేతలందరికీ ఒక హెచ్చరిక వంటిదని అన్నారు. నాయకులందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఫలితం తేటతెల్లం చేసిందన్నారు. భవిష్యత్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పకనే చెప్పిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో పండుగ వాతావరణం ... కమలనాథుల సంబరాలు...