Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

అన్నింటిలో స్త్రీ సగమైనపుడు.. తెలంగాణాలో మహిళా మంత్రులెక్కడ? షర్మిల ప్రశ్న

Advertiesment
#InternationalWomensDay
, సోమవారం, 8 మార్చి 2021 (15:49 IST)
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్త్రీలు అన్నింటిలో సగభాగమైనపుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంత్రులెక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో గత ఏడేళ్లుగా కేవలం ఇద్దరంటే ఇద్దరే మహిళా మంత్రులు ఉన్నారని గుర్తుచేశారు. 
 
సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా లోటస్‌ పాండ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహిళ ప్రాతినిధ్యం గురించి షర్మిల మాట్లాడారు. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. 
 
రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అని, కానీ ప్రస్తుత తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అని ప్రశ్నించారు. అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని షర్మిల ఆరోపించారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయమయ్యారని షర్మిల అభిప్రాయపడ్డారు. 
 
మహిళల విషయంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది మహిళలు మంత్రి పదవులు అలంకరించారని, ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత అది కూడా ఇద్దరికే అవకాశం ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. మహిళలు అన్నింటిలోనూ సగం అయినప్పుడు ఇలాంటి అసమానతలు ఎందుకో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
చట్ట సభల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. మహిళలకు అన్నింటా నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. నేటి నుంచి తాను చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని చెల్లిగా, అక్కగా మాటిస్తున్నానని షర్మిల హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వికో కంపెనీలో అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున మంటలు.. వైరల్