Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో వందేళ్లదాకా... హైదరాబాద్‌లో తాగునీటికి ఢోకా లేదు: నగరం చుట్టూ జలజలలు

నిజంగానే హైదరాబాద్ పంట పండింది. కాదు కాదు.. నీరు పండింది. నగరం చుట్టూ భారీ నీటి స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కావస్తుండటంతో ఈ జూలైనుంచి జంటనగరాలకు జల సిరి ఉరికి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ముంద

మరో వందేళ్లదాకా...  హైదరాబాద్‌లో తాగునీటికి ఢోకా లేదు: నగరం చుట్టూ జలజలలు
హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (07:45 IST)
నిజంగానే హైదరాబాద్ పంట పండింది. కాదు కాదు.. నీరు పండింది. నగరం చుట్టూ భారీ నీటి స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కావస్తుండటంతో  ఈ జూలైనుంచి జంటనగరాలకు జల సిరి ఉరికి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి నీటి నిల్వకు ప్రాధాన్యమివ్వడంతో గ్రేటర్‌ నగరానికి మరో వందేళ్లపాటు తాగునీటికి ఢోకా ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు సగర్వంగా ప్రకటించారు. భారతదేశం లోనే ఏ రాష్ట్రంలోనూ ఏ నగరానికి లేని తాగునీటి వసతి సౌకర్యం హైదరాబాద్‌కు ఏర్పడటంతో నగరవాసులు ఆనందంతో మునిగితేలుతున్నారు. హైదరాబాద్‌కు ఇంతకుమించిన శుభవార్త లేదంటే అతిశయోక్తి కాదు.
 
జూలై నెల నుంచి ప్రధాన నగరం (కోర్‌సిటీ) పరిధిలోని ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గోదావరి జలాల లభ్యత పుష్కలంగా ఉండడం, జూన్‌ నెలా ఖరులోగా నగరంలో పలు భారీ స్టోరేజి రిజ ర్వాయర్ల నిర్మాణం పూర్తవనున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు.  
 
ఫిబ్రవరి ఒకటి నుంచి నగరంలోని 173 మురికివాడల్లో 50 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి అదనంగా మరో లక్ష నల్లాలకు రోజూ గంటకు తగ్గకుండా నీళ్లిస్తామన్నారు. ఇదే సమయంలో నీటి వృథాను అరికట్టడం, కలుషిత జలాల సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లేదా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యన ఒక గంట పాటు మంచినీటిని సరఫరా చేయనున్నామన్నారు.
 
మరోవైపు నల్లా నీళ్ల సరఫరా వేళలపై వినియోగదారుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ సమాచారం అందించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే నెల నుంచి గ్రేటర్‌ పరిధిలోని 9.05 లక్షల నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని సంకల్పించింది. ఈ మేరకు సంక్షిప్త సందేశం అందించే ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎండీ తెలిపారు.
 
గ్రేటర్‌ నగరానికి మరో వందేళ్లపాటు తాగునీటికి ఢోకాలేకుండా శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌లో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్‌... మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వ సామర్థ్యంతో మల్కాపురం(నల్లగొండ) రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎండీ తెలిపారు. ఇందుకు అవసరమైన భూముల లభ్యతను గుర్తించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనుల్లో నిమగ్నమయ్యామన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లెలు రంగంలోకి దిగితే అన్న గతేమిటి?