తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత ఎన్నికల సంఘం అధికారులు గురువారం హైదరాబాద్ నగరంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న టెక్ మహీంద్రాలో ఈ సమావేశం జరుగనుంది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ మార్పులు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు హాజరుకానున్నారు. దీంతో టెక్ మహీంద్రా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించారు.
ముఖ్యంగా లెమన్ ట్రీ హోటల్ నుంచి సీఐఐ వరకు, కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోటరీ వరకూ, రోటరీ - సైబర్ టవర్స్ మధ్య, కొత్తగూడ నుంచి హైటెక్స్ వరకూ ఉన్న ప్రైవేట్ సంస్థలు ఇందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు.
లెమన్ ట్రీ జంక్షన్, పీనిక్స్ ఎరీనా రోడ్డు, టెక్ మహీంద్రా రోడ్, సీఐఐ కూడలిలో భారీ ట్రాఫిక్‌కు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు అలెర్ట్ చేశారు. దీంతో పాటు ఐకియా రోటరీ - లెమన్ ట్రీ జంక్షన్, సైబర్ టవర్ కూడలి, కేబుల్ బ్రిడ్జి జంక్షన్, సీగేట్ జంక్షన్, ఐకియా రోటరీ, కొత్తగూడ జంక్షన్ నుంచి సైబర్ టవర్ జంక్షన్ వరకూ భారీ ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు.