భాగ్యనగరి మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో ఎన్నో మహానగరాలు ఉంటే.. వాటికి దక్కని గౌరవం హైదరాబాద్ నగరానికి దక్కింది. దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. ఈ మేరకు హాలిడిఫై డాట్ కామ్ అనే వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.
నివాసయోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది. చారిత్రాత్మక కట్టడాలు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు తేలింది.
హైదరాబాద్ పర్యాటక కేంద్రాల్లో చార్మినార్, గొల్కొండ కోట నిలిచాయి. ఆయా నగరాల్లో పటిష్ఠమైన అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో ఈ సర్వేను నిర్వహించినట్టు ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు వెల్లడించారు.