Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్

హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్
, శుక్రవారం, 17 జులై 2020 (12:54 IST)
ఆ యువకుడి తల్లి కరోనా వైరస్ సోకి కన్నుమూసింది. ఫలితంగా ఆ యువకుడు తల్లి అంత్యక్రియలను నిర్వహించలేక తీవ్ర మనసికక్షోభను అనుభవించాడు. తనలా మరొకరు బాధపడకూడదని భావించి, ఓ నిర్ణయానికి వచ్చాడు. తన స్నేహితులతో కలిసి కరోనా మృతదేహాల తరలింపు, వారి అంత్యక్రియల కోసం ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. గతంలో వలసకూలీల కోసం ఫీడ్ ద నీడ్ పేరుతో ఎంతోమందిని ఆదుకున్న ఈ స్నేహితులు... ఇపుడు సర్వ్ ద నీడ్ పేరుతో కరోనా మృతదేహాల తరలింపు సేవలో తరిస్తున్నారు. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన ఈ సేవకుల వివరాలను పరిశీలిస్తే, కరోనా సోకి చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి అంత్యక్రియలు చేయలేని తమ స్నేహితుడు పడిన మానసిక క్షోభ మరెవరూ పడకూడదని భావించిన కొంతమంది ఐటీ ఉద్యోగులు ముందుకు వచ్చారు. 
 
కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక అంబులెన్స్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేస్తున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి దేహాలను శ్మశాన వాటికకు తరలించడం, అంత్యక్రియలను నిర్వహించడం వంటివి చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. 
 
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయితేజ, అమన్‌జీత్‌ సింగ్‌, తమ స్నేహితులతో కలిసి ముందుకు వచ్చారు. లాక్డౌన్‌ సమయంలో ‘ఫీడ్‌ ద నీడ్‌’ పేరుతో వలస కార్మికులకు, పేదవారికి ఆహారం అందించిన వీరు లాక్‌డౌన్‌ అనంతరం ‘సర్వ్‌ ద నీడ్‌’ పేరుతో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
webdunia
 
అనేక మంది కుటుంబ సభ్యులు కరోనా సోకడం వల్లనో.. కరోనా లక్షణాలు ఉండటం వల్లనో క్వారంటైన్‌లో ఉండటం వల్ల కరోనా మృతులకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నామని వారు పెద్దమనసుతో చెపుతున్నారు. ఈ అంబులెన్స్ నడిపేందుకు ఇద్దరు సిబ్బందిని నియమించి, వారికి జీతభత్యాలు వారే చెల్లిస్తున్నారు. 
 
లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో వీటిని ప్రారంభించారు. ఈ సర్వీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సేవలను ఉపయోగించు కోవాలనుకునేవారు 84998 43545 అనే వాట్సాప్ నంబరును సంప్రదించాలని కోరారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారని, త్వరలో వీరి కోసం కూడా అంబులెన్స్‌ను ప్రారంభించనున్నట్లు సాయితేజ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..