హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి దంపతుల జంట సురక్షితంగా చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం చెరువు కట్టపై విద్యుత్ సామాగ్రి లోడుతో ఉన్న ఓ కంటైనర్ వేగంగా దూసుకెళ్తున్నది. అయితే కంటెయినర్‌లో ఉన్న లోడు ఒక్కసారిగా దానిపైనుంచి జారి పక్కనే వస్తున్న కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమయింది.
అందులో ఉన్న దంపతులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారులో చిక్కుకున్న దంపతులను రక్షించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.