Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగ్యనగరిపై వరుణుడి పంజా.. మరో మూడు రోజులు వర్షాలే.. వర్షాలే

Advertiesment
భాగ్యనగరిపై వరుణుడి పంజా.. మరో మూడు రోజులు వర్షాలే.. వర్షాలే
, ఆదివారం, 18 అక్టోబరు 2020 (13:30 IST)
హైదరాబాద్ నగరం వర్షం దెబ్బకు అలాకుతలమైపోతోంది. గత మంగళవారం ఏకధాటిగా కురిసిన భారీవర్షానికి భాగ్యనగరం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఈ వరద నీరు ఇపుడిపుడే తగ్గుముఖంపడుతోంది. ఇంతలో శనివారం రాత్రి నుంచి మళ్లీ కుండపోత వర్షం మొదలైంది. 
 
ఇప్పటికే ఓసారి జలవిలయం పాలైన భాగ్యనగరం శనివారం రాత్రి కురిసిన వానతో మరింత తల్లడిల్లింది. హైదరాబాద్ నగరం జలప్రళయంలో చిక్కుకున్న తీరును సోషల్ మీడియాలో పలు వీడియోలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు మరోసారి వర్ష సూచన జారీ అయింది.
 
మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కురుస్తున్న వర్షాలు, రాగల 48 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా వ్యాపిస్తాయని తెలిపింది.
 
వాతావరణంలో విపరీత మార్పులే ఈ వర్షాలకు కారణమని, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఎక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
 
ఇదిలావుంటే హైదరాబాద్‌ను భారీ వర్షాలు మరోసారి ముంచెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలను వరద ముంచెత్తుతోంది. భారీ వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో వాహనాదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీ పరిధిలోని అల్‌జుబెర్‌ కాలనీ, బాబానగర్‌లో గుర్రం చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
 
ఉప్పుగూడ, సాయిబాబా నగర్‌, శివాజీనగర్‌, బాబా నగర్‌ బస్తీలు జలమయం అయ్యాయి. మలక్ పేటలో మరోసారి రోడ్డు జలమయమైంది. మంగళ్‌హాట్‌ పరిధిలోని ఆర్‌కే పేట్‌లో వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి చెందింది. మరోవైపు, కాచిగూడ, నల్లకుంట, తార్నాక, ఎర్రగడ్డ, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లో వర్షపు నీరు రోడ్లపై చేరింది. మల్కాజ్ గిరి, నాచారం, అంబర్ పేట  ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.  
 
మాదాపూర్, నానక్ రాంగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. ఎల్బీనగర్‌ పరిధిలోని కాలనీల్లోకి భారీగా వరద చేరింది. ప్రశాంతినగర్‌, గాంధీనగర్‌ సహా పలుకాలనీలతో పాటు ఆర్కేపురం డివిజన్‌లోని ఎన్టీఆర్‌నగర్‌ లోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి వరద ప్రవాహం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలనాథులకు బానిసలమా? ఆ ఒక్కదానికోసమే స్నేహం : అన్నాడీఎంకే