క్షణికావేశంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడో భర్త భార్యపై కోపంతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించాలనుకున్నాడు. కానీ పోలీసులుకు దొరికిపోయాడు. అతనిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్ ప్రైవేటు ఉద్యోగి.
అతడి భార్య ఓ పేరొందిన సంస్థలో రిసెప్షనిస్టు. అదే సంస్థలో పని చేస్తున్న అటెండర్ బాలరాజు. వెంకట్‌కు మరొకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అతడి భార్యకు చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయంపై భర్త వెంకట్‌ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో బాధితురాలు.. భర్త, కూతురిని వదిలేసి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెంకట్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేసినా.. రాకపోవడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు.
భార్య ఆఫీసులో పనిచేసే అటెండర్ బాలరాజు పేరుతో ఓ ఫేక్ ఈమెయిల్ ఐడీని సృష్టించి అందులో ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాతలు పెట్టాడు. దీంతో బాధితురాలు మానసిక వేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు ఈ మెయిల్‌ను రూపొందించింది బాధితురాలి భర్త వెంకట కిశోర్ అని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.