రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 410 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మంజిల్లా తల్లాడ పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణాల నుంచి తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో.. సీఐ వసంతకుమార్, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వై.సాంబశివరావు, సిబ్బందితో తల్లాడ ప్రధాన రహదారి రెడ్డిగూడెం వద్ద ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు.
అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు లారీలను ఆపి తనిఖీ చేశారు. 410 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు.
జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్లు తోట రవికుమార్, బిట్రా పుల్లారావును అదుపులోకి తీసుకొని విచారించారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని ఖమ్మం మీదుగా కాకినాడకు తరలిస్తునట్లు వారు తెలిపారని ఏసీపీ పేర్కొన్నారు.