నాలుగేళ్ల పాప వీధికుక్కల దాడికి గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకటి కాదు.. ఏకంగా మూడు కుక్కలు నాలుగేళ్ల పాపపై దాడికి దిగడంతో ఆ పాప వాటి నుంచి తప్పించుకోలేక ఏడ్వసాగింది. కేకలు పెట్టింది. ఆ పాప ఏడుపులు విని స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కుక్కలను తరిమికొట్టారు. పాపను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఉన్న కాలనీలో ఘోరం జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. ఆ పాప దాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లసాగింది. ఇంతలోనే ఊహించని రీతిలో ఆ కుక్క నందినిపై దాడి చేసింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాప భయాందోళనకు గురయింది.
కుక్కలు తనపై దాడి చేస్తోంటే ఏం చేయాలో తెలియక, వాటిని ప్రతిఘటించలేక గుక్కపట్టి ఏడవసాగింది. ఆ పాప ఏడుపులు విన్న స్థానికులు ఉరుకులు పరుగుల మీద ఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలను తరిమి కొట్టారు. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. పాప కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టు గుర్తించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.