హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్‌లాండ్, వీపీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా నగరంలోని మినహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. షబ్-ఏ-బరాత్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నెక్లెస్ రోడ్డు సహా మిగిలిన అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు నగర వాసులు, వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలో ఓ రహదారి ఉన్నట్టుండి కుంగిపోయింది. దీంతో స్థానికులంతా ప్రాణభయంతో హడలిపోయారు. సంతోష్ నగర్ - సైదారాబాద్ మార్గంలో ఈ రోడ్డు కుంగిపోయింది.
సంతోష్ నగర్ నుంచి ఐఎస్ సదన్ చౌరస్తాకు వెళ్లే రోడ్డు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఇందులోభాగంగా పిల్లర్ల నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వారు. ఈ కారణంగానే ఈ రోడ్డు కుంగిపోయివుంటుందని స్థానికులు భావిస్తున్నారు.