తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్ ధరించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేసింది. అయితే, అనేక మంది ఈ నిబంధనను పాటించడం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా పెరుగుతున్నా ముఖానికి మాస్కులు ధరించకుండా బహిరంగంగా చక్కర్లు కొడుతున్న 67,557 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అలాగే, మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేసినట్టు చెప్పారు. 22 మార్చి నుంచి 30 జూన్ మధ్య ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. ముఖానికి మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కేసులు పెట్టడమే కాదు జైలుకు కూడా పంపుతామని హెచ్చరిస్తున్నారు.
ఇక, రాజధాని హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 14,931 కేసులు నమోదు కాగా, రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290, ఖమ్మంలో 6,372, సూర్యాపేటలో 4,213, వరంగల్‌లో 3,907 మందిపై కేసులు నమోదు కాగా, అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.