మద్యం సేవించి వాహనం నడిపిన మందు బాబులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తేరుకోలేని షాకిచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా, మధ్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినవారిలో 3,220 మంది లైసెన్సులను రద్దు చేసింది. గత యేడాది రాష్ట్ర వ్యాప్తంగా 5,819 వాహనదారుల లైసెన్సులు రద్దు చేయగా, జనవరి ఒకటో తేదీనే ఏకంగా 3,220 మందికి లైసెన్సులను రద్దు చేయడం గమనార్హం.
గత యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు ఏకంగా 5,891 మంది వాహదారుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ యేడాది తొలి రోజునే ఏకంగా 3,220 మందికి షాకిచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవర్ పరీక్షల్లో పట్టుబడిన వారి నుంచి రూ.10 వేల అపరాధాన్ని వసూలు చేశారు.
కాగా, కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీన రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పట్టుబడిన వారి లైసెన్సులను రద్దు చేశారు. ట్రాపిక్ పోలీసుల నివేదిక, తనిఖీలలో గుర్తించిన తీవ్రత ఆధారంగా కోర్టులు వాహనదారులకు జరిమనాతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.