ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలు కూడా మూసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదావేస్తున్నట్టు హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ పరీక్షలను తదుపరి నిర్వహించేందుకు వీలుగా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వర్శిటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వాయిదావేసింది. అయితే, ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది.