నేను అందర్లో ఒకర్తెను... భిక్షగత్తెను... హైదరాబాదులో కరోడ్‌పతి బెగ్గర్స్ (వీడియో)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (గ్లోబల్ సమ్మిట్) ఈనెలాఖరులో జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (గ్లోబల్ సమ్మిట్) ఈనెలాఖరులో జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భిక్షాటనను నిషేధించారు. ఈ నిషేధంతో నగర వ్యాప్తంగా ఉన్న బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకుని చర్లపల్లి ఓపెన్ జైల్లో ఉన్న ఆనందాశ్రమానికి తరలించారు.
అక్కడ వాళ్లందరి వివరాలను నమోదు చేస్తున్నపుడు వారిలో కొంతమంది కోటీశ్వరులు, గొప్పగా బతికినవారు, అమెరికా గ్రీన్ కార్డు కలిగినవారు ఉన్నట్టు పోలీసులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వీరంతా తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇలాంటివారిని కదిలిస్తే.. ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటిగాథగా ఉంది. ఉదాహరణకు ఫర్జూనా అనే 50 ఏళ్ల మహిళను కదిలిస్తే.. ఎంబీఏ పూర్తి చేసి, లండన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసినట్లు చెప్పింది. ప్రస్తుతం లంగర్ హౌస్‌లో భిక్షాటన చేస్తుండగా, పోలీసులు ఆనందాశ్రమానికి తరలించినట్టు తెలిపింది. పైగా, ఆమె ఇంగ్లీషులో మాట్లాడటం విని పోలీసులు ఖంగుతిన్నారు.
భర్త చనిపోయాక, సమస్యలు తీవ్రంకావడంతో మనశ్శాంతి కోసం భిక్షాటన చేయమని ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న కొడుకు ఇచ్చిన సలహా మేరకు ఆమె బిచ్చగత్తెగా మారినట్లు వెల్లడించింది. తర్వాత ఆమె కుమారుడు వచ్చి అఫిడవిట్ సమర్పించి ఫర్జూనాను తీసుకెళ్లాడు.
ఇకపోతే, రబియా బైస్రా అనే మహిళది కూడా ఇలాంటి కథే. ఆమె అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్. కోటీశ్వరురాలు. దగ్గరి బంధువులే ఆస్తి కోసం మోసం చేయడంతో ఓ దర్గా దగ్గర బిచ్చగత్తెగా మారాల్సి వచ్చింది. ఆమెను ఆశ్రమానికి తరలించారని తెలిసి బంధువులు వచ్చి జాగ్రత్తగా చూసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆమెను వారితో పంపించారు. ఇలా అనేక మంది బెగ్గర్స్ కోటీశ్వరులు, బాగా బతికినవారు ఉండటం గమనార్హం.