తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కేవలం సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అంటే.. ఈ రాష్ట్రంలో కొత్త కేసులు కేవలం పదిలోపు మాత్రమే నమోదవుతున్నాయి. మంగళవారం ఆ రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది నిజంగానే శుభపరిణామం.
నిజానికి గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అది మంగళవారానికి కేవలం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1003 కరోనా కేసులు ఉన్నాయి.
అలాగే, ఒకే రోజులో కరోనా చికిత్స ముగించుకుని 16 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 332 మంది స్వేచ్ఛ పొందారు. 25 మంది చనిపోయారు. 646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 556 కేసులు ఉండగా, సూర్యాపేటలో 83 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంత 18859 మందికి ఈ కరోనా పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. మంగళవారం కూడా మరో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 70 కేసులు కేవలం మూడు జిల్లాలు అంటే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం.