వేములవాడ, సిరిసిల్ల తనకు రెండు కళ్లు అంటూ.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ స్పందించారు. ఇక్కడ ఎమ్మెల్యే లేనట్టుగా మీరు భావించారా? ఇక రాడనేది మీ భావన? అని ఆయన మంత్రిని ప్రశ్నించారు. గత 11 నెలలుగా ఈ దేశంలో లేని చెన్నమనేని రమేశ్‌ను వెనకేసుకొని రావడం ఏంటని ఆయన కేటీఆర్‌ను నిలదీశారు.
తమ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని చెబితే ప్రజలు చెన్నమనేనికి ఓటేశారన్న శ్రీనివాస్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్మనీ నుంచి పాలిస్తానంటే ఓటేసే వాళ్లు కాదన్నారు. మావాడని వేములవాడ ఎమ్మెల్యేను మీరు వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తోందని కేటీఆర్‌ను ఆది శ్రీనివాస్ విమర్శించారు.
ఎమ్మెల్యేపై ప్రజావ్యతిరేకత కనిపిస్తోందని.. ఈ విషయాన్ని కేటీఆర్ సైతం గమనించారన్నారు. సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేవాలయాన్ని రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. నిన్నటి సమీక్షా సమావేశంలో ఈ విషయంపై ఎందుకు చర్చించలేదని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
మీ నాయకుడి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో.. దాన్ని తగ్గించడం కోసమే మీరు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఇక్కడి శాసన సభ్యుడిని వెనకేసుకొచ్చినట్లు కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.