సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూన్ 8వ తేదీన కేబినేట్ భేటీ ఏర్పాటు కానుంది. ప్రగతిభవన్‌లో ఎనిమిదో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది.
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం పంటల సాగుకు రైతుబంధు విడుదల, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానుందనే హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లాక్‌డౌన్ ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఇక జూన్ 7న ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9కి వాయిదా వేశారు. మంత్రులందరూ ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖుల చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపైనా మంత్రి మండలి చర్చించే అవకాశముంది