Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మునుగోడుకు సీఎం కేసీఆర్ - ప్రజాదేవిన సభకు హాజరు

cmkcr
, శనివారం, 20 ఆగస్టు 2022 (12:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా ఆ పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులు పైఎత్తులు వేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మునుగోడులో తెరాస ప్రజాదీవెన పేరుతో ఓ బహిరంగ సభను శనివారం నిర్వహిస్తుండగా, ఇందులో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. మొత్తం లక్షన్నర మంది కూర్చొనేలా 25 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరిస్తారు. 
 
ఈ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరనున్నారు.
 
ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్‌ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
 
ప్రజాదీవెన బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూలిన చక్కి బ్రిడ్జి - హిమాచల్ ప్రదేశ్‌లో 14 మంది మృతి