వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.
మనదేశం చాలా గొప్పది. సహనశీలత దేశం. అవసరమైన సందర్భాల్లో త్యాగాలకు సిద్ధపడే దేశమని కొనియాడారు. పోరాటాలతో ముందుకు పోయే దేశం. అందర్నీ కలుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూలబోకే లాంటి గొప్ప దేశం. ప్రేమతో బతికేటటువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పనిలో పనిగా కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు.