Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడంబ అభయారణ్యంలో రెచ్చిపోయిన దుండగులు.. మంగళసూత్రంతో పాటు..?

కడంబ అభయారణ్యంలో రెచ్చిపోయిన దుండగులు.. మంగళసూత్రంతో పాటు..?
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:49 IST)
chain snatching
కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబ అభయారణ్య సమీపంలో దుండగులు రెచ్చిపోయారు. బైక్‌పై వెళ్తున్న యువ దంపతులను అడ్డగించి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతి మెడలోని మంగళసూత్రంతో పాటు బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... చింతలమానేపల్లి మండలం గంగాపూర్‌ నివాసులు అంజన్న, మౌనికకు ఆరు నెలల క్రితం వివాహమైంది. 
 
ఆధార్ అనుసంధానం నిమిత్తం దంపతులు సోమవారం బైక్‌పై కాగజ్‌నగర్‌కు వచ్చారు. పని పూర్తయ్యాక కడంబ మీదుగా చింతలమానేపల్లికి బయలుదేరారు. కడంబ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి మరో బైక్‌పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇనుపరాడ్‌తో ఆ దంపతులపై దాడి చేశారు. వారు కింద పడిపోగా మౌనిక మంగళసూత్రం, అంజన్న మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కున్నారు.
 
ఆ సమయంలో వెనుక నుంచి ఓ ట్రాక్టరు రావడాన్ని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. షాక్‌కు గురైన దంపతులు భయంతో అడవిలోకి పరుగులు తీశారు. ఆ దారిలో చింతలమానేపల్లికి చెందిన పలువురు వాహనంపై వస్తూ రోడ్డుపై పడివున్న బైక్‌ అంజన్నది గుర్తించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, ఎస్‌ఐ సందీప్‌ బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 
 
తీవ్రగాయాలతో ఉన్న అంజన్న, మౌనికలను కాగజ్‌నగర్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇరువురికి తలపై తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రాత్రి 11 గంటలకు కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్ధస్వామి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. సంఘటన గురించి వివరించే పరిస్థితుల్లో బాధితులు లేకపోవడంతో వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీక్షకు తీసుకొచ్చి డబ్బులివ్వట్లేదు.. కిరాయి కూలీల ఆందోళన