తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్యాబినెట్ విస్తరణపై రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. పనికి మాలినోళ్ళను మంత్రులుగా పెట్టుకున్నాడంటూ కేసీఆర్‌పై రేవంత్ ఫైర్ అయ్యారు.
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇవ్వరని తాను ముందే చెప్పానని రేవంత్ రెడ్డి తెలిపారు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విమర్శలు చెయ్యకూడదని అనుకున్నానన్నారు.
కానీ తాను భయపడి విమర్శలు చెయ్యడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకపై కేసీఆర్ చేసే తప్పులపై మాట్లాడతానని, తల తెగిపడినా సరే వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కర్మ కాలిన రోజున ఆయన కూడా ఊచలు లెక్కపెడతారని, అప్పుడు, మోదీ కూడా ఆపలేరని తెలిపారు.