Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీసీ పదవికి ఒక్క ముస్లిం దొరకలేదా?: కేసీఆర్‌ను నిలదీసిన మహ్మద్‌ అలీ షబ్బీర్‌

వీసీ పదవికి ఒక్క ముస్లిం దొరకలేదా?:  కేసీఆర్‌ను నిలదీసిన మహ్మద్‌ అలీ షబ్బీర్‌
, సోమవారం, 24 మే 2021 (13:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారని మాజీ మంత్రి, తెలంగాణ శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆరోపించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం శనివారం పది మంది  వైస్‌–ఛాన్సలర్లను నియమించిన జాబితా పరిశీలిస్తే అదే అర్ధం అవుతుందన్నారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా కేసీఆర్‌ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు.
 
షబ్బీర్‌ అలీ జారీ చేసిన మీడియా ప్రకటనలో, సీఎం కేసీఆర్‌ తనొక లౌకిక నాయకుడని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారని, ఆచరణలో మాత్రం రహస్య మతపరమైన ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఉన్నత పదవులను ఇవ్వకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మతపరమైన ఎజెండాను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.   

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్, సభ్యుల నియామకాల్లో ముస్లింకు ప్రాతినిధ్యం కల్పించడంలో కేసీఆర్‌ విస్మరించారని, అదేవిధంగా వీసీల నియామకంలో ముస్లిం ప్రతిని«ధిగా ఒక్కరిని కూడా పరిగణించలేదని, కేవలం ముస్లింలను ఇతర మైనారిటీలను వివిధ నిర్ణయాత్మక సంస్థలలో లేదా ఇతర అధికార స్థానాల్లో అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
 
‘విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో జనాన్ని నమ్మించి 2014లో అధికారంలోకి వచ్చారు. తర్వాత కూడా అలాంటి బోగస్‌ హామీలే ఇచ్చి రెండోసారి కూడా అధికారాన్ని వశం చేసుకున్నారు అయితే, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన వివిధ సంస్థలలో ముస్లింలకు ప్రాతినిధ్యం ఒక్క శాతం కూడా కల్పించలేదు.

దురదృష్టవశాత్తు ముస్లింలు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా లేదా విశ్వవిద్యాలయానికి  వీసీగా నాయకత్వం వహించలేరని కేసీఆర్‌ నమ్మడం శోచనీయం. ముస్లింలకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయడమే కాకుండా నామినేటెడ్‌ పదవుల్లోనూ తీరని అన్యాయం చేయడం దారుణం..’ అని  కేసీఆర్‌ ప్రభుత్వంపై షబ్బీర్‌ దుమ్మెత్తిపోశారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికైనా మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసి పనిచేసే ప్రమాదం ఉంటుందని షబ్బీర్‌ హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు 80 శాతం మైనార్టీలకు చెందిన ఉన్నత విద్యా సంస్థలను మూసేయించారని చెప్పారు. మైనారిటీ సంస్థలను దోచుకున్న కేసీఆర్‌ ఇప్పుడు వివిధ సంస్థలలో ముస్లింల ఉనికిని కూడా లేకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారని, ముస్లింల ఉనికిని నిర్మూలించే కుట్ర అమలు జరుగుతోందని ఆయన ఆరోపించారు.
 
హజ్‌ కమిటీ, మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కమిషన్, ఉర్దూ అకాడమీ మొదలైన మైనారిటీలతో నిర్వహించే అనేక సంస్థలు తలలేనివిగా చేశారని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ తప్పు ఎత్తిచూపారు. తల లేని శరీరంగా అవి ఉన్నాయని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే మైనారిటీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ఇలా చేయడం ద్వారా ఇతర సంస్థల్లో ముస్లింల ఉనికిని తగ్గించడానికి లేదా పూర్తిగా నిర్మూలించే ఎత్తుగడను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే మైనారిటీ సంస్థలను బలహీనపరిచేందుకు శక్తివంచన లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ వాస్తవ విషయాలను టీఆర్‌ఎస్‌తో సంబంధం ఉన్న ముస్లిం నాయకులు లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని, టీఆర్‌ఎస్‌లో కొనసాగాలో లేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని షబ్బీర్‌ విజ్ఞప్తి చేశారు.
 
‘కేసీఆర్‌ సర్కార్‌ ఎలాంటి భయం లేదా విచారం లేకుండా ఆరు మసీదులను కూల్చేసింది. సచివాలయంలో కూల్చివేసిన మసీదులను పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని 20 నెలలు అయినా సీఎం అమలు చేయలేదు. హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ముస్లింలు ఇతర మైనారిటీలను, వారి సంస్థలను లక్ష్యంగా చేసుకునే మతపరమైన ఎజెండాను కేసీఆర్‌ బాహాటంగా అమలుచేస్తున్నారు.

చివరికి మసీదులు వంటి ప్రార్థనా స్థలాల విషయంలో కూడా నిర్ధాక్షణ్యంగా వ్యవహిస్తూ తాను లౌకిక నాయకుడని తప్పుడు వాదనలు చేయడం ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.. ‘అని ఆయన విమర్శించారు.
 
కోవిడ్‌ –19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు నమోదు చేసిన కేసుల్లో మత పక్షపాతం కొట్టొచ్చినట్లు కనబడుతోందని కూడా షబ్బీర్‌ అలీ ఆరోపించారు.  అంటువ్యాధుల నివారణ చట్టం కింద సౌత్‌ జోన్‌ (హైదరాబాద్‌ పాతబస్తీ), వెస్ట్‌ జోన్స్‌ల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని అన్నారు. 

లాకౌడౌన్‌  కాలంలో స్వాధీనం చేసుకున్న వేలాది వాహనాల్లో ఎక్కువ భాగం మైనారిటీలకు చెందినవే ఉన్నాయని చెప్పారు.  చాలా కేసులు బనాయించినవేనని తెలిపారు. మైనారిటీలకు ఆర్థిక ఇబ్బందులు కలిగించేందుకు వాళ్ల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని షబ్బీర్‌ ఆరోపించారు.
 
శనివారం ’కఠినంగా లాక్‌డౌన్‌’ పేరుతో పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని షబ్బీర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా ప్రాంతాల్లో పోలీస్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓల ప్రకారం పరిమితుల నుండి మినహాయింపు పొందిన వ్యక్తులను కూడా వేధించడమే కాకుండా కొట్టారని ఆరోపించారు. పరిస్థితి చాలా దారుణంగా మారిందన్నారు.

హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి తమ నిస్సహాయతను వ్యక్తం చేశారని, పోలీసు బలగాలను నియంత్రించడంలో వాళ్లు తమ నిస్సహాయతను ఒప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రుల ఆధీనంలో పనిచేసే అధికారులకు ఆదేశాలు జారీ చేయకుండా డీజీపీని అభ్యర్థించే దుస్థితిని వారు రావడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్య చేశారు.
 
హైదరాబాద్‌ నగరానికి చెందిన ముగ్గురు పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించామని, ఆహార రవాణా సహా ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించొద్దని ఆదేశించినట్లుగా డీజీపీ ఈరోజు తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారని చెప్పారు. అంటే శనివారం వాటిని ఎక్కడపడితే అక్కడ నిలిపివేయడం తప్పు అని అంగీరిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలనే నిర్ణయం అమలులో భాగంగా పాస్‌లు ఉన్న వారిని, ఆహార సరఫరా చేసే వారిని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి అన్యాయంగా స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ విడుదల చేయాలని పట్టుబట్టారు. లాక్‌డౌన్‌ కఠిన అమలు పేరుతో సామన్య ప్రజలను వేధించిన, కొట్టిన పోలీసులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో డీజీపీ ప్రకటించాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో 600 మంది చిన్నారులకు అస్వస్థత..300మందికి పాజిటివ్.. థర్డ్ వేవేనా..?