తెలంగాణ రాష్ట్ర పాత సచివాలయ భవనం కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ కూల్చివేత పనులను నిలిపివేయాలంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భవనాల కూల్చివేతతో వాతావరణం కాలుష్యమవుతోందని, నగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా, కూల్చివేత సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ పేర్కొన్నారు. అలాగే, మున్సిపల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారించింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, సెక్రటేరియట్ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన విపక్ష పార్టీల నేతలందరూ గగ్గోలు పెడుతున్నారు. కరోనా వైరస్‌తో ప్రాణాలు పోతుంటే, అవి పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులు చేపట్టిందనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెల్సిందే.