తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లు, కుర్చీలు, కోడి గుడ్లతో దాడి చేశారు. ఇంట్లోని పూలకుండీలు, అద్దాలు ధ్వంసం చేశారు.
రామమందిరం నిధుల సేకరణపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణుల ఆందోళన చేపట్టాయి. ఇంటి ముందు బైఠాయించి.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియా సమావేశం నిర్వహించారు
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధికోసమే భాజపా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తామొక్క పిలుపునిస్తే ప్రజలు కమలదళం నాయకులను ఉరికిచ్చికొడతారని హెచ్చరించారు.
అలాగే, మరో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భాజపా తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు.