కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కిషన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నవంబర్ 1న జరగనుంది.
ఈ సమావేశంలో బీజేపీ మూడో జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో జాబితాలో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. 52 మంది అభ్యర్థులతో భాజపా ఈ నెల 22న తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 27న బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఈ ఒక్క పేరుతోనే రెండో జాబితా విడుదలైంది. మూడో జాబితా కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. మూడో జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా టికెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు.
బీజేపీ ఇంకా 66 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 20 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. అయితే, జనసేనకు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు భాజపా సుముఖంగా ఉంది. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు.
అభ్యర్థుల జాబితా విడుదలలో బీఆర్‌ఎస్ ముందుంది. 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. బీజేపీ ఇంకా 66 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.