తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా పందేలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్సా.. కారా లేక కమలం వికసిస్తుందా అంటూ జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. బెట్టింగ్ బంగార్రాజులు కూడా రంగంలోకి దిగి అధికారంలో వచ్చేదెవరనే దానిపై భారీ మొత్తంలో బెట్టింగ్స్ కాస్తున్నారు. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిపై బెట్టింగులు పెట్టగా, ఈ దఫా హస్తం గుర్తుపై భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ బెట్టింగుల్లో కేవలం డబ్బు మాత్రమే కాకుండా చివరకు ఇల్లూ, పొలాలు సైతం పెడుతుండటం విస్తుపోయే అంశంగా చెప్పుకోవచ్చు. కేవలం పార్టీలపైనే కాకుండా, కీలక అభ్యర్థుల గెలుపోటములపై కూడా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కాస్తున్నారు.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ పోలింగ్ జరుగనుంది. ఈ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల ప్రచారమే కాదు.. పందెం రాయుళ్ల బెట్టింగ్ దందా కూడా జోరందుకుంది. విశేషమేంటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇక్కడి కంటే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అక్కడి బెట్టింగ్ బంగార్రాజులు రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు.
పార్టీలతో పాటు కీలక నేతల జయాపజయాలపై కూడా పందేలు కాస్తున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఏపీలో ఇలాగే జోరుగా పందేలు కాశారు. సాధారణంగా బెట్టింగ్స్.. సర్వేలపై ఆధారపడి ఉంటాయి. అందుకే.. ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు ఎన్ని? అందులో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలను పందెంరా యుళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే సర్వేలు చేసిన సంస్థల విశ్వసనీయత ఎంత? గతంలో అవి చేసిన సర్వేల వాస్తవిక ఫలితాలు ఎలా ఉన్నాయి వంటి అనేక అంశాలను క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు.
వీటి ఆధారంగానే పందేలు కాస్తున్నారు. అలాగే రాజకీయ నేతలతో టచ్‌లో ఉండే సర్వే సంస్థలను కొందరు స్వయంగా కలుస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే పార్టీ ఏంటో ఒకటికి రెండుసార్లు అంచనాలు సరిచూసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి తెలంగాణలో ఉన్న తమ పరిచయస్తులు, స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల మూడ్ ఎలా ఉంది? ఎటువైపు గాలి వీస్తోందో ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఏ పార్టీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయో కూడా తెలుసుకుంటున్నారు.
కాంగ్రెస్ వైపే జోరుగా బెట్టింగులు
గత ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చడంతో కూటమి విజయావకాశాలు సన్నగిల్లాయి. దీంతో 2018లో చాలామంది టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపుపై పందేలు కాశారు. అయితే.. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందంటూ పందేలు కాసేవాళ్ల సంఖ్య పెరిగిందని విజయవాడకు
చెందిన ఒక పందెంరాయుడు చెప్పాడు. పదిమందిలో ఏడుగురు కాంగ్రెస్ గెలుస్తుందని పందేలు కాస్తుండగా.. బీఆర్ఎస్ విజయంపై బెట్టింగ్ పెట్టేవారి సంఖ్య గతంతో పొల్చుకుంటే తక్కువగా ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ గెలుపుపై వైసీపీ వారే ఎక్కువ నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో విజయాపజయాలపై కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుండగా.. మరికొందరు సిండికేట్‌గా మారి పందేలు కడుతున్నట్టు సమాచారం. అంటే.. అందరూ తాము ఫణంగా పెట్టాలనుకుంటున్న సొమ్మును సిండికేట్‌లో పెడతారు. గెలిస్తే అందులో వారి వాటా ఎంతో అంత వస్తుంది. పోతే మొత్తం పోతుంది. వ్యక్తిగతంగా అయినా, సిండికేట్ ద్వారా అయినా.. చాలా మంది రూ.లక్షలు, కోట్లల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే.. వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు సమాచారం.