బెదిరింపులకు భయపడితే ఇక మేం పని చేసినట్లే: అకున్ సబర్వాల్
డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నందుకు ఎవరో బెదిరిస్తే ఆపేది లేదని, తన భద్రతను ఇద్దరు సెక్యూరిటీ అధికారులు చూసుకోగలరని తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. అదే సమయంలో తమ విభాగంపై, తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు
డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నందుకు ఎవరో బెదిరిస్తే ఆపేది లేదని, తన భద్రతను ఇద్దరు సెక్యూరిటీ అధికారులు చూసుకోగలరని తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. అదే సమయంలో తమ విభాగంపై, తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్నామని ఇంతవరకు ఎవ్వరినీ బెదిరించలేదని, అందరినీ మర్యాదపూర్వకంగా, ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నామన్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్నా, కొనుగోలు చేసినా, విక్రయించినా, ఇంట్లో పెట్టుకున్నా కేసులు నమోదు చేసే అధికారం ఉందని, ఇలాంటి కేసుల్లో తమ విభాగానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.
కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేసినట్టు వస్తున్న వార్తలు అసత్యం. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులిచ్చాం, వారిలో ఇప్పటికి ఐదుగురిని ప్రశ్నించాం. ఇప్పటివరకు ఈ కేసులో 27 మందికి నోటీసులిచ్చాం, అలాగే కెల్విన్‌తో కలిపి 19 మందిని అరెస్ట్ చేశాం. ఇతరులను కూడా విచారిస్తున్నాం. ఎవరిపైనా వివక్ష చూపడం లేదని సబర్వాల్ చెప్పారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వతంత్రంగా, రాతపూర్వకంగా ఒప్పుకున్నాకే వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నాం. విచారణలో ప్రతీ 8 గంటలకోసారి తమ బృందంలోని వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నామన్నారు.
అలాగని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేం.. అందరికీ పిల్లలున్నారు కాబట్టి, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయము. వారంతా మైనర్లు కావడం వల్ల తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తున్నాం, అలాగే డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అకున్ సబర్వాల్ తెలిపారు.
నిజాయితీ కలిగిన సీనియర్ ఐపీఎస్‌లు, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. తదితర విభాగాలతో ప్రతీక్షణం టచ్‌లో ఉంటున్నాం. దర్యాప్తులో సందేహాలుంటే తీర్చుకుంటున్నామని అకున్ తెలిపారు. పోలీస్ శాఖలో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల సలహాలు కూడా తీసుకుంటున్నామన్నారు. తమ వద్ద ఎక్సైజ్‌లో టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు న్నారని, సిట్ బృందంలో మహిళా అధికారులను కూడా నియమించామని తెలిపారు.
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విభాగానికి విచారణ అధికారం లేదని, దర్యాప్తు అధికారులు సరిగ్గా లేరని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు చాలా తప్పు.. గతేడాది జూన్‌లో ఎక్సైజ్ విభా గానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కేసుల్లో తమ విభాగానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సెక్షన్ 41, 42, 53 కింద నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు చేసే అధికారం కూడా ఉందని అకున్ సబర్వాల్ తేల్చిచెప్పారు. డ్రగ్స్ తీసుకున్నా, కొనుగోలు చేసినా, విక్రయించినా, ఇంట్లో పెట్టుకున్నా కేసులు నమోదు చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.